ఒంగోలు : గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ పి రాజాబాబును కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.5,745 మాత్రమే ఇస్తుండటంతో కుటుంబ పోషణ కష్టతరంగా ఉందన్నారు. అందు వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీసవేతనం రూ.26వేలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామ పంచాయతీల స్థాయిలో సుస్థిర, శాశ్వతవనరుల ఏర్పాటు, గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల సానుకూల దృక్పథంతో న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులను నిరోధించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు. ఈనెల 5లోపు సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పూనుకోవాల్సి వస్తోందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో జిల్లా అధ్యక్షుడు శ్యాంసన్, జాన్‌బాబు, రాజు, ఎజ్రా, సంజీవరావు, ధనుంజయ్, చిరంజీవి ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: