అద్దంకిలో ఆరోగ్యకర రాజకీయానికి ఆహ్వానం! -డబ్బుతో కాకుండా సేవలతో పోటీ పడదాం – ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం 100 పడకల ఆస్పత్రి కడదాం -మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి వైసీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ -సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బహిరంగ లేఖ

అద్దంకి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీల కార్యకర్తలు డబ్బులు ఖర్చుపెట్టి ఒకరిపై ఒకరు పోటీ పడటం కంటే, మనం ఇద్దరం కలిసి ఒక ఆరోగ్యకరమైన ఎన్నికకు శ్రీకారం చుడదామా? అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేశారనే పోటీ వద్దు, ఎవరు ఎంత అభివృద్ధి చేశారనే విషయంలో పోటీ ఉండాలని సూచించారు. పార్టీల కోసం ఖర్చు చేసే డబ్బులో కొంతైనా ప్రజల ఆరోగ్యం కోసం మళ్లిస్తే, మన ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రిని నిర్మించలేమా? అని ప్రశ్నించారు.

ఒక ఎన్నిక కోసం ఖర్చు చేసే డబ్బు ఒక్కసారికే ఉపయోగపడుతుంది, కానీ ఒక 100 పడకల ఆసుపత్రి వేల కుటుంబాలకు తరతరాల పాటు వినియోగంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే నా ప్రతిపాదన ఒక్కటే, ఎన్నికల్లో పోటీ చేద్దాం, కానీ ప్రజల కోసం కలిసి పని చేద్దాం అని పిలుపునిచ్చారు.

డబ్బు ఖర్చులో కాదు, అభివృద్ధిలో పోటీ పడదాం. పార్టీల మధ్య పోటీ ఉండొచ్చు, ప్రజల ఆరోగ్యం విషయంలో మాత్రం ఐక్యంగా నిలుద్దాం అంటూ.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారూ ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరిస్తారా? అంటూ డాక్టర్ అశోక్ తన లేఖలో సవాల్ విసిరారు. ఈ బహిరంగ లేఖపై మంత్రి రవికుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *