తౌశిక్ కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, గౌరవ హైకోర్టు అనుమతి తీసుకున్న అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా 100 శాతం అమలు చేస్తున్నామన్నారు.
మౌలాబి కేసుకు సంబంధించి తొలుత నమోదైన 306 కేసును మార్పు చేశామని, ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. దర్యాప్తులో ఎవరైనా నిందితులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చలో ఒంగోలు కలెక్టరేట్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. కొంతమంది నాయకులకు సరైన సమాచారం లేకపోవడం వల్లే ధర్నాకు పిలుపునిచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసులకు తెలియజేసిన వారి సంఖ్యకు, ప్రచారం చేసిన సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించామన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, కొంతమందితో ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వచ్చిన నాయకులకు కొన్ని షరతులు విధించినట్లు తెలిపారు. అయితే, వారు ఆ షరతులను పూర్తిస్థాయిలో పాటించకపోవడంతో ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేశారు.
ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తును పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుని, పోలీసులకు సహకరించాలని, అనుమతి లేని చలో కలెక్టరేట్ ధర్నాలో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ బాలమురళి కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: