విద్యుత్ ఛార్జీలను ఐదు పైసలు కూడా పెంచలేదు-ఏల్చూరులో రూ. 35.78కోట్లతో సబ్ స్టేషన్ కు శ్రీకారం -అభివృద్ధి పనులకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన -ఎల్ నినో ప్రభావమే బియ్యం ధరల పెరుగుదలకు కారణం -సోలార్ వినియోగానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపాలి

ఒంగోలు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను ఐదు పైసలు కూడా పెంచలేదని, ఇకపైనా పెంచబోమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఛార్జీలు పెంచడంతోపాటు వెళ్తూ వెళ్తూ రూ.20 వేల కోట్ల ఈఆర్సీ భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపిందని ఆయ‌న‌ ఘాటుగా విమర్శించారు. సోమవారం సంత‌మాగులూరు మండ‌లం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో రూ.35.78 కోట్లతో 12 ఎకరాల్లో నిర్మించనున్న 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.ఈ సబ్‌స్టేషన్ పూర్తయితే ఏల్చూరు పరిసర ప్రాంతాలకు లో-వోల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. అంతేకాకుండా ఇదే మండలంలో రెనెవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుతో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ యువతకు ఉద్యోగ‌ అవకాశాలు లభిస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. జోన్ కు భూములిచ్చిన కుటుంబాల త్యాగాన్ని గుర్తించి ఉద్యోగాల భర్తీలో ఆయా కుటుంబాల యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయ‌న‌ చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • రూ.78 వేల సబ్సిడీతో పీఎం సూర్యఘర్ సోలార్ పథకం…

రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎల్‌నినోతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింద‌న్నారు. ఈ ప్రభావంతో విద్యుత్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.78 వేల సబ్సిడీతో అందుబాటులో ఉన్న పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే పీక్ అవర్స్‌లో విద్యుత్ సమస్యలను తగ్గించవచ్చన్నారు. సోలార్ వినియోగానికి ప్ర‌జ‌లు మ‌రింత‌గా మొగ్గు చూపాల‌ని ఆయ‌న‌ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గి వ్యవసాయం దెబ్బతిందని పేర్కొన్నారు. ఈ కారణంగా బియ్యం ధరలు పెరిగాయన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వమే కిలో బియ్యాన్ని రూ.48కి విక్రయిస్తోందని తెలిపారు.

  • భూ స‌మ‌స్య‌ల‌కు చ‌ట్ట ప‌రిధిలో ప‌రిష్కారం..

నిషేధిత భూములు, దేవాదాయ శాఖ భూములు, 22ఏ జాబితా కారణంగా ఏళ్ల తరబడి దీర్ఘ‌కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. దీర్ఘకాలిక భూ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు లేని భూముల సమస్యలను సీఎం ఆదేశాలకు అనుగుణంగా పరిష్కరిస్తున్నామన్నారు. నిషేధిత జాబితాలో ఉండటంతో భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడం, వాటిని పిల్ల‌ల‌కు కూడా బదలాయించ లేకపోతున్న పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారు. కొరిశపాడు మండలం దైవాల‌రావూరు సమస్యను సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే పరిష్కరించామని మంత్రి చెప్పారు. అదే విధంగా దీర్ఘకాలంగా నిషేధిత జాబితాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న భూ సమస్యలను గుర్తించాలని ఇప్పటికే తహశీల్దార్లను ఆదేశించినట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చట్టపరంగా అవకాశం ఉన్న ప్రతి భూ సమస్యనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈకార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ తేలప్రోలు రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు చేవూరి వాసురెడ్డి, విద్యుత్ శాఖ విజయవాడ ప్రాజెక్టు ఎస్ఈ బి. సత్యనారాయణ రెడ్డి, ఒంగోలు ఓఅండ్ఎం ఎస్ఈ వి. రాజగోపాల్ నాయుడు, కె. వెంకటేశ్వర్లు, ఈఈ సీహెచ్. శ్రీనివాసులు, అద్దంకి ఈఈ నల్లూరి మస్తాన్ రావు, సంతమాగులూరు మండల ఏడీఈ శివప్రసాద్, ఏఈ దీపక్ రెడ్డి, తహసీల్దార్ కె. రవిబాబు, ఎంపీడీఓ జ్యోతిర్మయి, కూటమి నాయకులు దుద్దేల చిన్న గాలెయ్య, నక్క వెంకటేశ్వర్లు, నక్క పెద్ద గాలెయ్య, నక్క చిన్న సాంబయ్య, గమిడి కోటేశ్వరరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *