ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే సన్న రకం బియ్యం ధరలు అదుపు తప్పి ఆకాశాన్నంటుతున్నాయి. ఎటువంటి పన్నుల భారం, వినియోగం పెరగకుండానే బియ్యం వ్యాపారులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు.
- ఎల్ నినోను ఆసరాగా చేసుకుని దోపిడీ:
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వరి సాగు చేశారు. గత సీజన్ తో పోల్చుకుంటే ప్రస్తుతం వరి సాగు గణనీయంగా తగ్గింది. దీన్ని అవకాశంగా తీసుకుని మిల్లర్లు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
- మూడు నెలల్లో రూ.800 పెంపు:
జూన్, జూలై నెలల్లో బీపీటీ, సూపర్ ఫైన్ సాధారణ బియ్యం 25 కిలోల బస్తా రూ.1,200, మంచి రకం రూ.1,300లకే విక్రయించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అదే బస్తా రూ.500 పెంచి రూ.1,750 నుండి రూ.1,900 వరకు విక్రయించారు. ప్రస్తుతం, అక్టోబర్ నెలలో ఆ ధర ఏకంగా రూ.1,900 నుండి రూ.2,000కి చేరింది. అంటే కేవలం మూడు నెలల్లోనే బస్తాపై రూ.700 నుండి రూ.800 వరకు పెరిగిందన్న మాట.
- రైతులకు నష్టం.. ప్రజలకు భారం:
గతేడాది పండించిన ధాన్యాన్ని కల్లాల్లోనే తక్కువ ధరకు అమ్ముకుని, ఇప్పుడు రెండింతల ధర చెల్లించి బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు ధాన్యాన్ని దాచుకునే వీల్లేక, చేసిన అప్పులు తీర్చేందుకు పండిన పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బియ్యం ధరలు చూస్తే గుండెకోతకు గురవుతున్నారు. మున్ముందు ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
- ధరల నియంత్రణకు చర్యలేవీ…
పెరుగుతున్న బియ్యం ధరలపై కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటంతో ఇటు వ్యాపారులు అటు మిల్లర్లు బరితెగిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బియ్యం ధరలను అదుపులోకి తెచ్ఛేందుకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
తాజా సన్న బియ్యం ధరల పట్టిక – 25 కిలోల బస్తా (అక్టోబర్ 2026)
బియ్యం రకం ప్రస్తుత ధర
BPT / సూపర్ ఫైన్ (సాధారణ) రూ. 1,900
HMT సన్న బియ్యం రూ. 1,900 – 2,000
JSR ప్రీమియం కోలం రూ. 2,087
లలిత సోనా మసూరి రూ. 1,783
కర్నూలు సోనా మసూరి రూ. 1,950 – 2,050
స్టీమ్ రైస్ (25కిలోలు) రూ. 2,100
నంద్యాల సోనా మసూరి (క్వింటా) రూ. 8,200
సన్న నూకలు (25కిలోలు) రూ. 950

Save or share this story as a newspaper-style Epaper Clip: