మున్సిపల్ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల ఏర్పాటు కొరకు నగరంలోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల, రైజ్ ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు కలిసి గురువారం పరిశీలించారు.
పురపాలక సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ను జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు ఉండాలన్నారు. అదే మాదిరిగా స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లు ఎన్నికల కమిషన్ సూచించినట్లుగానే ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలని పలు సూచనలు చేశారు. పటిష్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తూచాతప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు.
ఆయన వెంట జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, డి ఆర్ ఓ పి.వెంకటరమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, తదితర మున్సిపాలిటీల కమిషనర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: