అండాల అక్రమ సేకరణ వెనుక భారీ నెట్‌వర్క్‌…. మల్కాజ్ గిరి సీ పీ బడుగుల సుమతి..ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసులో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అరెస్ట్.సద్గురు హెల్త్ కేర్ ఖాతాల్లో రూ.487 కోట్ల లావాదేవీల గుర్తింపు.600 మంది డోనర్ల గుర్తింపు..43 క్లినిక్‌లకార్యకలాపాలపై లోతైన దర్యాప్తు.

హైదరాబాద్ నవంబర్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్ )
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంసృష్టించిన ఓయాసిస్ ఫెర్టిలిటీ అండాల అక్రమ సేకరణ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లుమల్కాజిగిరి సీపీ సుమతి
వెల్లడించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
ఈ కేసులో సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు కీలక ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఏ8 నిందితుడిగా సద్గురు హెల్త్ కేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ప్రతీక్ అనిల్ గగ్లానీ (44), ఏ9 నిందితుడిగా ఓయాసిస్ ఫెర్టిలిటీ కార్పొరేట్ ఆఫీస్ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేవ్‌లను ఏసీపీ ప్రవీణ్ రెడ్డి పర్యవేక్షణలో అరెస్ట్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించామన్నారు.
అనుమతులు లేకుండా అండాల సేకరణ, ఏఆర్‌టీ (ART) నిబంధనల ఉల్లంఘన, మహిళల అక్రమ రవాణా కోణాల్లో దర్యాప్తు సాగుతోందని సీపీ సుమతివివరించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో సరూర్‌నగర్ (2), బేగంపేట (1) సహా డీఎంహెచ్‌ఓ ఫిర్యాదులతో మలక్‌పేట్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, మాంకాళి, మియాపూర్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. సంస్థ ఫౌండర్ వెంకట సూర్య కిరణ్ గీదెల, కో-ఫౌండర్ డాక్టర్ గీదెల దుర్గారావు ఆదేశాల మేరకు ఏజెంట్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి, హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని చెప్పారు. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ కేంద్రాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
నిందితుల వాంగ్మూలం ప్రకారం సద్గురు హెల్త్ కేర్ దేశవ్యాప్తంగా 43 క్లినిక్‌లు నిర్వహిస్తోందని, నెలకు సుమారు 600 సెల్ఫ్ సైకిల్స్, 100 డోనర్ సైకిల్స్ ద్వారా రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జిస్తోందని సీపీ తెలిపారు. సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.487 కోట్ల డెబిట్, క్రెడిట్ లావాదేవీలను గుర్తించామన్నారు. అండాల దానం పేరుతో పేద మహిళలకు నామమాత్రపు నగదు చెల్లించి, సంతానం కోసం వచ్చే దంపతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు.
సద్గురు హెల్త్ కేర్ ఆధ్వర్యంలోని ఓయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ఏఆర్‌టీ బ్యాంకులతో పాటు డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ సెంటర్, నర్మద ఫెర్టిలిటీ సెంటర్ల కార్యకలాపాలపైనా విచారణజరుపుతున్నట్లు సీపీ సుమతి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 600 మంది డోనర్లను గుర్తించామని, 8 ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, కీలక రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వేతనం పొందుతున్న ఏ8, ఏ9 నిందితులు నిబంధనలకు విరుద్ధంగా వైద్యుల నియామకం, పరికరాల కొనుగోళ్లు, క్లినిక్‌ల నిర్వహణలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సంస్థకు చెందిన 11 మంది డైరెక్టర్ల బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీల కోణంలోనూ లోతైన దర్యాప్తు కొనసాగుతోందని సీపీ వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *