చదువుకున్న పాఠశాలను, చదువు చెప్పిన గురువులను ఎన్నటికీ మర్చిపోరాదని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్ధులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కొండపి మండలం ముప్పవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెరిదేపిలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చదువుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థ నిర్వహకునిగా ఉన్న ముప్పరాజు శ్రీనివాసులు ఆయా పాఠశాలలకు, అందులోని విద్యార్థులకు అవసరమైన పరికరాలను విరాళంగా ఇస్తున్న సందర్భంగా శుక్రవారం ఈ రెండు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటేనే ఉన్నత స్థానాలకు చేరతారనే అభిప్రాయం సరికాదని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ప్రభుత్వ, ప్రైవేటు. రంగాలలో ఉన్నత స్థానాలలో దేశ విదేశాలలో రాణిస్తున్న వ్యక్తులు మన కళ్ల ముందే ఉన్నారని ఆయన అన్నారు. ఉద్యోగం కంటే ఉన్నత వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదిగిన తరువాత బాల్యంలో మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకుంటూ మన పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన చెప్పారు. మన జిల్లాలో రూ.1200 కోట్లతో నాడు – నేడు పధకంలో పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. మన తలరాతను మార్చేది విద్యేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలను ఉన్నత, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది గురువులేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని, ఆలోచనా స్ఫూర్తితో మెరుగైన విద్యాబోధన అందించేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ పెట్టాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల నైపుణ్యాలను నిరంతరం గమనిస్తూ వాటిని మెరుగుపరిచేలా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ పాఠశాలల పూర్వ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు. ఎం.పి.పి. స్కూల్లో నిర్వహించిన “మేరీ మాటీ మేరా దేశ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
విద్యార్థులకు సైకిళ్లు, నోట్ పుస్తకాలు, పాఠశాలలకు అవసరమైన ఫర్నీచర్, ప్రింటర్, ఐరన్ ర్యాకులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కలెక్టర్ చేతుల మీదుగా ముప్పరాజు శ్రీనివాసులు అందజేశారు.
పాఠశాలల అభివృద్ధి కోసం ముప్పరాజు శ్రీనివాసులు చేస్తున్న సహాయం పై ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పాఠశాలలకు ఏ సహాయం కావాలన్నా అందించడానికి ఎల్లవేళలా తాను ముందుకు వస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసులు ప్రకటించారు.
కార్యక్రమంలో డి.ఈ.ఓ. వి.ఎస్.సుబ్బారావు, పి.ఈ.ఓ. సామా సుబ్బారావు, మండల స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ, ఎం.పి.డి.ఓ. రమణమూర్తి, తహశీల్దార్ శింగారావు, ఎం.ఈ.ఓ.లు సురేఖ, రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*జగనన్న కాలనీలో పరిశీలించిన జిల్లా కలెక్టర్*
అనంతరం పెరిదేవిలోని జగనన్న కాలనీ లే అవుట్ ను కలెక్టర్ సందర్శించారు. ఇళ్ల నిర్మాణాలలో పురోగతిని ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెప్పగా త్వరలోనే పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయం – జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
11
Aug