అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి స్థానికంగానే వైద్యం అందించడమే లక్ష్యంగా “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో వైద్య సిబ్బంది పని చేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలను గుర్తించడానికి, అనంతరం అక్టోబరు నెలలో విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ముందుగా వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరించాలని, అవసరమైన వైద్య సేవల కోసం సర్వే చేయడానికి ఏరోజున ఏ.ఎన్.ఎం. వస్తారో ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఏ.ఎన్.ఎం. ప్రతి ఇంటికీ వెళ్లి బాధితులకు అవసరమైన పరీక్షలు చేసి ఆ వివరాలను కేస్ షీట్ లో నమోదు చేసి డాక్టర్లకు అందజేయాలన్నారు. బాధితులతో ఏ.ఎన్.ఎం. మాట్లాడుతున్నప్పుడు, ఆ వివరాలను నమోదు చేసుకునేటప్పుడు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బాధితుల ఆరోగ్య సమస్య విషయంలో గోప్యత పాటించాలని ఆయన చెప్పారు. తమ పరిధిలో ఏ రోజున వైద్య శిబిరం నిర్వహిస్తామో ప్రజలకు వాలంటీర్లు, ఏ.ఎన్.ఎం.లు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయా తేదీలలో వైద్య శిబిరాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ శిబిరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎం . పి.డి.ఓ.లను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఈ వైద్య శిబిరాలలో ఆ ప్రాంత పరిధికి చెందిన ఫ్యామిలీ ఫిజీషియన్ పధక డాక్టర్ ఒకరు, మరో పి. హెచ్.సి. డాక్టర్, డి.ఎం.ఈ. ఆసుపత్రుల నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ పాల్గొనేలా డి.ఎం.హెచ్.ఓ.. ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. వైద్య శిబిరాలకు భవనాల కోసం అవసరమైతే పాఠశాలలను వినియోగించుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎం.ఈ.ఓ.లు సహకరించాలని, గర్భిణిలు, బాలింతలు, చిన్న బిడ్డలను ఈ శిబిరాలకు తరలించడంలో ఐ.సి.డి.ఎస్., ఐ.టి.డి.ఏ. సిబ్బంది చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ ఆదేశించారు. రోగి పరిస్థితిని బట్టి అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు వారిని తరలించాలని వైద్య అధికారులకు ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమంలో ఏ స్థాయి అధికారి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నెల 15 నుంచి చేపట్టే సర్వే, వచ్చే నెలలో వైద్య శిబిరాల నిర్వహణను పర్యవేక్షించడానికి డి.ఎం. హెచ్.ఓ., డి. సి. హెచ్.ఎస్. కార్యాలయాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ డి.ఎం. హెచ్.ఓ. రాజ్యలక్ష్మి.. డి.సి. హెచ్.ఎస్. ఎస్.ఎన్.మూర్తి, జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్, డి.ఐ.ఓ. పద్మజ, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
