ఉపాధిహామీ పధకంలో ని ఉద్యానవన పనులకు సంబంధించి అనుమతులు పొందిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

ఉపాధిహామీ పధకంలో భాగంగా ఉద్యానవన పనులకు సంబంధించి అనుమతులు పొందిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
అధికారులను ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఉద్యానవన పనులకు సంబంధించి అనుమతులు పొందినచోట వెంటనే మొక్కలు నాటాలన్నారు. వీటికి సంబంధించిన నగదును వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలని కలెక్టర్ చెప్పారు. సగటు వేతనం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రివైజ్డ్ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కు సంబంధించిన ప్రతిపాదనలను పంపించి వాటికి అనుమతులు పొంది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఏ.పి.డి.లు ఈ విషయంపై మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పధకం ద్వారా హౌసింగ్ పనిదినాలను 100 శాతం కల్పించాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు ఉదయం, సాయంత్రం కచ్చితంగా వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సేవలకు సంబంధించిన నగదులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని ఆయన చెప్పారు. జలజీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికీ కుళాయి నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, అగ్రికల్చర్, హార్టీకల్చర్, పశు సంవర్ధక శాఖ, జగనన్న పాల వెల్లువ, తదితర అంశాల పైనా కలెక్టర్ సమీక్షించారు. వీటిలో మరింత పురోగతి వచ్చేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ముందుగా ఎలక్షన్, రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమంలో సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, డి.పి.ఓ. నారాయణ రెడ్డి, హౌసింగ్ పి.డి. పేరయ్య, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. మర్దన్ అలీ, పంచాయతి రాజ్ ఎస్.ఈ. కొండయ్య, జి.ఎస్. డబ్ల్యు.ఎస్. అధికారిణి ఉషారాణి, పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *