ప్రజల ఆరోగ్యానికి మరింత భద్రత కల్పించి నిరంతరం సమగ్రంగా పర్యవేక్షించేలా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ -జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్


ప్రజల ఆరోగ్యానికి మరింత భద్రత కల్పించి వారి పరిస్థితిని నిరంతరం సమగ్రంగా పర్యవేక్షించేలా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ సన్నాహాలుపై బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబుతో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఇందులో పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఫిజీషియస్’ కార్యక్రమం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలోనే ప్రజలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వీటిని మరింత విస్తృత పరిచేలా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు. ఇందులో భాగంగా వాలంటీర్ల సహకారంతో ఏ.ఎస్.ఎం.ల ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలందరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న ప్రజలను గుర్తించి సంబంధిత వివరాలతో ఏ.ఎస్. ఎం.లు ప్రత్యేకంగా కేసు షీట్స్ తయారు చేస్తారన్నారు. బీ.పీ, షుగర్, రక్తం, కఫం, మూత్రం, తదితర ఏడురకాల పరీక్షలను కూడా ఇంటి వద్దే నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇలా 15 రోజులపాటు ప్రతి ఇంటికీ వెళ్లి ఈ విధమైన ఆరోగ్య సర్వే, ప్రాథమిక పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో, పట్టణ ప్రాంతాలలో యు. హెచ్.సి. పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకూ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ శిబిరాలు ఏర్పాటు చేసే తేదీలను వాలంటీర్ల ద్వారా టోకెన్లు ఇచ్చి ప్రజలకు తెలియచేస్తామన్నారు. ఈ విధంగా జిల్లాలో 556 శిబిరాలు నిర్వహణకు ప్రణాళిక రూపొందించామన్నారు. కేసు షీట్స్ ద్వారా గుర్తించిన అనారోగ్యాలను బట్టి అవసరమైన స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఈ శిబిరాలలో వైద్య సేవలు అందిస్తామని వివరించారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన ఔషధాలను ఈ శిబిరాలలో అందజేస్తారని, మరింత వైద్యం అవసరమైతే పైస్థాయి ప్రభుత్వ ఆసుపత్రులకు, పరిస్థితిని బట్టి ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రోగులను పంపుతామని వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆరోగ్య సర్వే, వైద్య శిబిరాల నిర్వహణ విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో సుమారు 1100 గా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3200లకు పైగా పెంచారని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో 60 వేల మంది డాక్టర్లను, వైద్య సిబ్బందిని భర్తీ చేసి వైద్య రంగాన్ని బలోపేతం చేసినట్లు చెప్పారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ల నుంచి బోధనాసుపత్రుల వరకు ప్రతి స్థాయిలోనూ నాడు – నేడు పథకంలో అవసరమైన నిర్మాణ పనులను చేపట్టి మౌలిక వసతులను పెంచినట్లు వివరించారు. నాణ్యత విషయంలోనూ రాజీ లేకుండా మంచి ఔషధాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ఈ వైద్య శిబిరాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్షయ రోగులకు పోషకాహారం అందించడంలో సహాయం అందిస్తున్న పలువురు స్థానికులను ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించి ప్రశంసా పత్రాలు ఇచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి, ఐ.సి.డి.ఎస్.పి.డి. మాధురి, డి.ఈ.ఓ. వి.ఎస్. సుబ్బారావు, జడ్పీ సి. ఈ.ఓ. జాలిరెడ్డి, డి.ఐ.ఓ. పద్మజ, డి.సి.హెచ్.ఎస్. ఎస్.ఎస్.మూర్తి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి సురేష్ కుమార్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ,పద్మావతి, మున్సిపల్ చైర్మన్ పి. వెంకటసుబ్బయ్య, వైస్ చైర్మన్ ఆర్.డి. రామకృష్ణ. మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య, మెడికల్ ఆఫీసర్లు నాయబ్ రసూల్, సుమయ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *