స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. ఈ దిశగా జిల్లా స్థాయి యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి వెళ్తున్నట్లు తెలిపారు. బుధవారం గిద్దలూరులోని చీతిరాల వెంకటేశ్వర్లు కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల స్థాయి ‘ జగనన్నకు చెబుదాం ‘ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు అన్నా రాంబాబు, జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తున్నారని, ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేలా అధికార యంత్రాంగమే వారి వద్దకు వెళ్ళేలా ప్రతి మండలములో ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 408 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రతి అర్జీని సహేతుకంగా, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
శాసనసభ్యులు అన్నా రాంబాబు మాట్లాడుతూ… పశ్చిమ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగా గిద్దలూరు మండలాన్ని ఎంపిక చేసినందుకు కలెక్టరుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టరు దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్తే పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజలు వచ్చారని, అర్జీ దారులు సంతృప్తి చెందేలా అధికార యంత్రాంగం వీటిని పరిష్కరించేలా చూడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఎంపీడీవో హేమలత, తహసిల్దార్ సీతారామయ్య, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

