ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే త్వరగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం దర్శి మండల స్థాయి స్పందన కార్యక్రమం స్థానిక శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 170 అర్జీలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలన్న లక్ష్యంతో స్పందన కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గత నాలుగు నెలలుగా నియోజకవర్గ కేంద్రాలలోనూ స్పందన కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్పందన కార్యక్రమాలను మరింతగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి మండల కేంద్రాలలో నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి బుధ మరియు శుక్ర వారాలలో జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం మండలాలకు తరలి వెళ్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. స్పందన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా సహేతుకంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీలను పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. గతంతో పోలిస్తే అర్జీలు పునరావృతం అవుతున్న శాతం గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. పునరావృతమవుతున్న మిగతా పిటిషన్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆయన చెప్పారు. స్పందన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయి అధికారులు స్పందన అర్జీలను పరిష్కరిస్తున్న తీరును ఆయా శాఖల జిల్లా అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని జాయింట్ కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ఆర్.డి.ఓ. అజయ్ కుమార్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎం.పి.డి.ఓ. కుసుమ కుమారి, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





