స్వమిత్వ సర్వేపై ఎం.పి.డి.ఓ.లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి సంక్షేమ, అభివృద్ధి అంశాలపై మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.పి.డి.ఓ.లు తమ పరిధిలోని గ్రామాలలో పర్యటించి స్వమిత్వ సర్వేలో పురోగతి వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో 69 గ్రామాలలో ఈ సర్వే జరుగుతుందని, 43 గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, 14 గ్రామాలలో గ్రౌండ్ వ్యాలిడేషన్ మరియు 12 గ్రామాలలో ఆర్.ఓ.ఆర్. ప్రాసెస్ లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు చూడచక్కని గ్రామాలుగా మార్చడానికి వినూత్నంగా ఆలోచించి పారిశుధ్య కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను పరిశీలించాలన్నారు. ప్రతి రోజూ ఇంటింటికి వెళ్లి చెత్తను కచ్చితంగా సేకరించాలన్నారు. గ్రామాలలో వీధుల వెంట చెత్త నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు ఎస్. డబ్ల్యు.పి.సి. షెడ్లకు తరలించాలని ఆయన చెప్పారు. ఎస్.డబ్ల్యు.పి.సి. షెడ్డుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ విషయంపై ఎం.పి.డి.ఓ.లు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మాణాలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా వేయాలన్నారు. సర్వీసులకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ చేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ విషయంపై ఎం.పి.డి.ఓ.లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జలజీవన్ మిషన్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాలైన సచివాలయాలు, ఆర్.బి.కె.లు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలను పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పూర్తయిన ఈ భవనాలను వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
జగనన్న ఇళ్ల నిర్మాణాలను డిసెంబరు 24 లోపు కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. ఎం.పి.డి.ఓ.లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంటి పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరై కూడా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు పట్టాలను రద్దు చేసి వారి స్థానంలో అర్హత ఉన్న వారికి పట్టాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అదే విధంగా బేస్మెంట్ వరకు నిర్మించి తరువాత నిర్మాణ పనులను చేపట్టని వారి పట్టాలు కూడా రద్దు చేస్తామన్నారు. ఇలాంటి లబ్ధిదారులను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి నిర్మాణ పనులు చేపట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో డి.పి.ఓ. నారాయణ రెడ్డి, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పి.డి. పేరయ్య, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, డి.ఈ.ఓ. సుబ్బారావు, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. కొండయ్య, ఇరిగేషన్ ఎస్.ఈ. లక్ష్మా రెడ్డి, జి.ఎస్.డబ్ల్యు.ఎస్. అధికారి ఉషారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.

