ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ నీరు విడుదల అయినదని, గురువారం ప్రకాశం జిల్లా కు మీరు చేరుతుందని జిల్లా ఎస్.ఈ లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ తాగునీటిని దుర్వినియోగం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు విషయాలు ఏమన్నారంటే…. ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 5 నియోజక వర్గములలోని 14 మండలములలో 88 గ్రామీణ త్రాగునీటి చెరువులు, 4 పట్టణ SS ట్యాంక్స్ నకు త్రాగు నీటి సరఫరా చేయబడుచున్నది. 2023-24 నీటి సంవత్సరమునకుగాను ఇప్పటి వరకు నాగార్జున సాగర్ జలాశయమునకు చాలా స్వల్ప మొత్తంలో మాత్రమే నీరు చేరడము జరిగినది. తేదీ : 06.10.2023 న జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశము నందు సాగర్ జలాశయము నుండి త్రాగు నీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కమిటీ వారు నిర్ణయించడము జరిగినది. ఇందులో భాగముగా ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలలో ఏర్పడిన త్రాగునీటి ఎద్దడి పరిస్థితుల దృష్ట్యా నాగార్జున సాగర్ కుడి కాలువ (N.S.R.C) క్రింద ఉన్న త్రాగునీటి చెరువులను నింపుటకుగాను 5 TMC ల నీటిని కుడికాలువకు విడుదల చేయుటకుఅనుమతించడమైనది
త్రాగునీటి విడుదల క్రమములో భాగముగా నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా తేదీ: 07-10-2023 నుండి త్రాగు నీటిని విడుదల చేయడం జరుగుచున్నది. ప్రకాశం జిల్లా సరిహద్దు అయిన కుడి కాలువ 85/3 మైలు వద్దకు సరఫరా చేయబడిన నీరు 12.10.2023 నకు చేరవచ్చునని అంచనా వేయడమైనది. దాదాపు పది రోజుల పాటు సరఫరా చేయబడే ఈ నీటితో ప్రకాశం జిల్లాలో అత్యంత నీటి ఎద్దడి ఉన్న RWS &S మరియు మునిసిపాలిటీలకు సంబంధించిన అన్నీ త్రాగు నీటి చెరువులను నింపడము జరుగుతుంది. నాగార్జున సాగర్ నందు ఉన్న కొద్దిపాటి నీటి నిల్వల దృష్ట్యా ఖరీఫ్ నందు కేవలము వర్షాధార పంటల సాగును మాత్రమే చేపట్టవలసినదిగా నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగమునకు ఇదివరకే విజ్ఞప్తి చేయడము జరిగినది. కావున త్రాగు నీటి కోసం విడుదలచేయబడిన నీటిని ఎట్టిపరిస్థితులలో వ్యవసాయ మరియు ఇతర అవసరములకు వినియోగించవద్దని ఆయకట్టు రైతాంగమునకు సూచించడమైనది. సాగర్ జలాశయమునందు నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నందున, త్రాగు నీటి చెరువులలో నింపబడిన నీటిని 3 నుండి 4 మాసములు జాగ్రత్తగా త్రాగు నీటి అవసరముల నిమిత్తము మాత్రమే వాడుకొనవలసిందిగా కోరడమైనది. తదుపరి మంచినీటి సరఫరా జనవరి మాసములో ఉండవచ్చునని తెలుపడమైనది. త్రాగు నీటి చెరువులకు నీటి విడుదల మరియు సదరు చెరువులను నింపుట జలవనరుల, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీసు శాఖల పర్యవేక్షణలో జరుగుతుందని తెలియజేయడమైనది. ఈ క్రమములో, ప్రకాశం జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగాన్ని అధికారులకు సహాయ సహకారములు అందించవలసినదిగా కోరడమైనది. త్రాగు నీటికి విడుదలచేసిన నీటిని అనధికారకముగా ఇతర అవసరములకు మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న అన్నట్లు ఎస్.ఈ లక్ష్మిరెడ్డి వివరించారు.