కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పథకాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా జిల్లాను మరింత అభివృద్ధి పధంలో నడిపించాలి -ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి -జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ “దిశ” సమావేశం నిర్వహణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పథకాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా జిల్లాను మరింత అభివృద్ధి పధంలో నడిపించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ “దిశ” సమావేశం బుధవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఆయన అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ట్రైనీ కలెక్టర్ శౌర్య మన్ పటేల్ కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ పధకాల అమలులో పురోగతి, స్థానిక సమస్యలు పరిష్కారమవుతున్న తీరుపై సమీక్షించారు.
ముందుగా గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన అంశాలు, సమస్యలపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. అనంతరం ఎం.పి. మాట్లాడుతూ రైల్వే, జాతీయ రహదారులు, బి.ఎస్.ఎన్.ఎల్. ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. శింగరాయకొండ వద్ద జాతీయ రహదారిపై అత్యవసర సమయంలో విమానాల ల్యాండింగ్ కోసం నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ లోపాలను సరిచేసి త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అధికారులకు సూచించారు. రైల్వే లెవల్ క్రాసింగ్ ల వద్ద ఆర్.యు.బి., ఆర్.ఓ.బి.ల నిర్మాణానికి స్థానిక పరిస్థితిని పరిశీలించి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. గ్రామాలలో అవసరమైన చోట తాగునీటి సరఫరాకు వినియోగించుకునేలా షుమారు ఐదు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను తాను సమకూర్చుతానని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని సమర్థంగా వినియోగించుకునేలా దృష్టి సారించాలని ఆయన సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అధికార వ్యవస్థను క్షేత్రస్థాయికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లిందన్నారు. ఇదే స్ఫూర్తితో జడ్పీ టి.సి.లను, ఎం.పి.పి.లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బెంగళూరు – కడప – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి దాదాపుగా భూసేకరణ ప్రక్రియ పూర్తి అయిందని, నిర్వాసితుల బ్యాంకు ఖాతాలలో నష్టపరిహారం కూడా జమ అయినట్లు చెప్పారు. వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఈ నెలాఖరులోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ..గ్రామీణ రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి అవసరాలు తీర్చడానికి జడ్పీ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ఎం.పి. ల్యాడ్స్ నిధులను కూడా ఈ అవసరాలకు ప్రాధాన్యత కల్పించి కేటాయించాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఆమె కోరారు. జిల్లాలో కరువు మండలాలు ఎక్కువగానూ, మంచి నీటి వనరులు తక్కువగానూ ఉన్నందున సి.పి. డబ్ల్యు. పథకాలకు జడ్పీ నిధులను గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఆమె విజ్ఞప్తి చేశారు.
మేయర్ గంగా సుజాత మాట్లాడుతూ ఒంగోలు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన చోట కల్వర్టులు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు వంటి చర్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన చేపట్టడానికి అవసరమైన సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆమె కోరారు.
జడ్పీ టి.సి.లు, ఎం.పి.పి.లు మాట్లాడుతూ గ్రామాలలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లించేలా చూడాలని, మోపాడు కాల్వపైన బ్రిడ్జి త్వరగా చేపట్టాలని, దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని, కొండపి నియోజకవర్గానికి సంబంధించిన కార్యాలయాలను కందుకూరు నుంచి ఇక్కడికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, రైల్వే లెవల్ క్రాసింగ్ (ఎల్.సి.) పనులను చేపట్టాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, డ్వామా పి.డి. శ్రీనారెడ్డి, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, బి.ఎస్.ఎన్.ఎల్, రైల్వే, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు, జడ్పీ టి.సి.లు, ఎం.పి.పి.లు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *