సికింద్రాబాదు తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో 2024-2025 నూతన విద్యా సంవత్సరానికి కొత్త కోర్సులను ప్రవేశ పెట్టనుంది. తార్నాకలో ఈ కళాశాల 1 ఆగస్టు 1977న ప్రారంభించబడి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ నిబంధనలకు అనుగుణంగా, 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు తెరవబడ్డాయి. ఈ కళాశాలలో ప్రవేశానికై విద్యార్థులు https://dost.cgg.gov.inని సందర్శించడం ద్వారా ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ ) కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప్రస్తుతం, బి.కాం (జనరల్), బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బి.ఎస్సి(ఏం.పి.సి), బి.ఎస్సి (ఏం.పి.సి. ఎస్.), బి.ఎస్సి(ఏం.ఎస్.సి.ఎస్) కోర్సులు ఉన్నాయి. ఇంకా విద్యార్థుల ప్రయోజనం కోసం 2024-2025 విద్యా సంవత్సరం నుండి రైల్వే డిగ్రీ కళాశాలలో బి.బి.ఎ మరియు బి.కాం(ఫైనాన్స్) నూతన కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలియజేస్తున్నారు. కళాశాలలో ప్రవేశానికి అన్ని కోర్సులు దోస్త్ ఆన్లైన్ పోర్టల్‌లో ఉన్నాయన్నారు.
కళాశాలలో ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కళాశాల విద్యార్థుల ప్రయోజనార్ధం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్‌ల కోసం విశాలమైన ఆటస్థలం అందుబాటులో ఉంది . ఇటీవల విద్యార్థులు ఆటలు, క్రీడల్లో రాణించేందుకై నూతనంగా బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని వారు కోరారు.

