ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు… టైటిల్ వేటలో దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతోంది… + 30 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 6 వికెట్లతో సునాయాసంగా గెలిచే స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇవ్వగా సమీకరణం 24 బంతుల్లో 26 పరుగులుగా మారింది. క్లాసెన్, మిల్లర్ లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. తొలి బంతికే క్లాసెన్ వెనుదిరగ్గా… 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ ఎప్పటికీ మరచిపోలేని అత్యద్భుత క్యాచ్ తో మిల్లర్ వెనుదిరిగాడు. అంతే… తర్వాతి – ఐదు బంతులు లాంఛనమే అయ్యాయి… భారత్ ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది.
