జిల్లాలో చేపట్టిన ప్రాజెక్ట్ లు , వాటి ప్రస్తుత స్థితిగతులు, ప్రభుత్వం నుంచి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని తెలియజేసేలా డి.ఆర్.సి. సమావేశానికి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ నెల 4వ వతేదీన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన డి.ఆర్.సి. సమావేశం ఉన్నందున శనివారం కీలకమైన శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై ఆరాతీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాఖలలో జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి, ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాసం, జగ్జీవన్ మిషన్, జిల్లాకు విత్తనాలు, ఎరువుల డిమాండ్ సరఫరా, ఇరిగేషన్ మరమ్మతులు, ఇతర నిర్మాణాలు, పెండింగ్ బిల్లులు, కొత్త ప్రతిపాదనలతో కూడిన వివరాలను సమగ్రంగా పొందుపరచాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, సి.పి.ఓ. డి. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి. ఎస్.ఈ. దేవానందం, ప్రాజెక్ట్స్ ఎస్.ఈ. అబూత్ అలీం, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి గోపీచంద్, ఏ.పి.ఎం.ఐ.పి. పి.డి. పి.వి.రమణ, డి.ఎం.హెచ్.ఓ. సురేష్ కుమార్, డి.సి. హెచ్.ఎస్. సూరిబాబు, జి.జి.హెచ్. సూపిరింటెండెంట్ దుర్గాదేవి, మార్కెటింగ్ ఏ.డి. ఉపేంద్ర, గనుల శాఖ డి.డి. రాజశేఖర్, పంచాయతీరాజ్, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ, డ్వామా, ఆర్.డబ్ల్యు.ఎస్., పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.

