యమద్వితీయ పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం గాంధీ రోడ్డులోని గీతా మందిర భక్త బృందం అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి చీర సారే, పసుపు కుంకుమలను, గాజులు, పండ్లను సమర్పించారు.
ముందుగా గీతా మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గీత శ్లోకాలను పటిస్తూ గాంధీ రోడ్, దక్షిణం బజారు, పప్పు బజార్ ల మీదుగా వాసవి దేవస్థానం చేరి అమ్మవారికి సారె సమర్పించి అన్నా చెల్లెల పండుగను ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అష్టోత్తర సహస్రనామార్చన, మంత్రపుష్పం, మహా హారతి సమర్పించారు. తదుపరి సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రాలను పఠించారు. అనంతరం ప్రసాదవితరణ చేశారు.
పురాణ కథనం ప్రకారం సూర్యపరమాత్మకు సంతానం యమధర్మరాజు, యమున లు. ఒకనాడు సోదరుడైన యమధర్మరాజును తన ఇంటికి భోజనమునకు యమున పిలవగా తమ రోజువారి పనులలో యముడు తీరికలేక చాలా రోజుల తరువాత దీపావళి పండుగ రెండవరోజు విదయ తిధినాడు సోదరి ఇంటికి వెళ్ళి తన చేతి భోజనమును స్వీకరిస్తాడని, సోదరి అనురాగానికి సంతుష్టుడై ఒక వరము కోర్కొనమనగా అంతట యమున అన్నా! సోదరి ఇంట భోజనము చేసిన సోదరులకు సిరి సంపదలు, అకాల మృత్యువు రానివ్వద్దని కోరగా తధాస్తని వరము ప్రసాదించాడని, కనుకనే ఈ పండుగకు యమ ద్వితీయ, యమ విదియగ పిలుస్తూ నామవాచకముగా అన్నాచెల్లెళ్ల పండుగగా వాసికెక్కినదని. బ్రాహ్మణ, ఆర్యవైశ్యుల కుటుంబాలలో ఈ పండుగ మిక్కిలి సంతోషాలతో నిర్వహించుకొంటారని, ఉత్తరాదిన భాయిదూజ్ పేరుతో వ్వహరిస్తారని, పెళ్ళి తరువాత పుట్టింటికి దూరమైన సోదరి తో మేము ఎప్పుడూ నీ వెంటనే ఉన్నామని తెలుపుటకు, కుటుంబ బాంధవ్యాలు పటిష్టముగ ఉండటానికి ఈ పండుగ ఉపకరిస్తుందని ఆలయ పూజారి శర్మ వివరించారు.
ప్రతిభానంద సరస్వతి మాతాజీ, దోగిపర్తి సుబ్రమణ్యం, రాజరాజేశ్వరి, కే. కృష్ణ, కొప్పురావూరి సురేఖ, దేసు అరుణ, ఉపేంద్ర, అనిత, చీమకుర్తి శివప్రసాద్, భారతి, హేమకేష్, గుర్రం రాజేష్ తదితర గీతా మందిర భక్త బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు.




