జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ఈ దిశగా సమన్వయంతో ముందుకు వెళుతుందని అన్నారు. ఆదివారం పాత జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి స్వామితో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖార్ జైన్, జడ్పీ సిఈఓ బి. చిరంజీవి పాల్గొన్నారు. అజెండాలోని అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
అనంతరం మంత్రి బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. .. విద్య, రహదారులు-భవనాలు , సంక్షేమం, పౌరసరఫరాలు, విద్యుత్ శాఖ కు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించిన తీరును వివరించారు. విద్య విధానంలో దేశానికే మోడల్ గా ఆంధ్రప్రదేశ్ గెలిచేలా మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని చెప్పారు . ఈ దిశగా నిపుణులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రకాశం జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ళలో మరమ్మతుల కోసం రూ.17 కోట్లను మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం సరిగా దృష్టి సారించక పోవటం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, వాటిని రప్పించడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆయా అంశాలపై చర్చించినట్లు చెప్పారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎవరైనా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయకుండా దొంగ లెక్కలు చెప్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని , అదే సమయంలో అభివృద్ధి ఈ విషయంలోనూ రాజీ పడబోమని స్వామి స్పష్టం చేశారు. గౌరవ జడ్పిటిసిలు, ఎంపీపీలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశ నిర్దేశం చేసామన్నారు. గత సమావేశంలో వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను కూడా అధికారులు తెలియజేసినట్లు మంత్రి చెప్పారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హాస్టల్ మరమ్మతులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చించామన్నారు. కొన్నిచోట్ల ప్రోటోకాల్ సమస్య ఎదుర్కొన్నట్లు కొందరు సభ్యులు చెప్పారని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
అపోహలు వద్దు
పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్వామి చెప్పారు. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాక ఫౌండేషన్, ప్రైమరీ మోడల్, మోడల్ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు, కొనసాగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయతీకి కేవలం ఒకటి మాత్రమే మోడల్ స్కూలు ఉంటుందనే అపోహ వద్దన్నారు. కనీసం ఒకటి ఉండాలనేది నిబంధన అని వివరించారు. అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ మోడల్ స్కూల్స్ ఏర్పాటు విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విద్యపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సింగరాయకొండ లో గతంలో మూతబడిన పాఠశాలను తిరిగి తెరిపించానని చెప్పారు. స్కూల్స్ లో డిజిటలైజేషన్ కొనసాగుతుందని అన్నారు. ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ , దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ........ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని, నాడు - నేడు పథకం కింద గతంలో చేపట్టిన పనుల్లో పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ .. .......నాడు - నేడు పనుల్లో అవకతవకల పైనా విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో స్కూల్స్లో పెట్టిన ఆర్వో ప్లాంట్ లు పనిచేయటం లేదన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ ..... పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ .. కరేడులో బి. సి బాలికలకు హాస్టల్ నిర్మాణాన్ని పూర్తి చేయలని కోరారు.
పెండింగ్ రోడ్ల నిర్మాణం పై దృష్టి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పూర్తికాని రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు రవికుమార్, స్వామి ఆదేశించారు. బెంగళూరు - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం లో భాగంగా హెవీ వెహికల్స్ తిరగటం వలన అంతర్గత రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. దీనిపై మంత్రి రవికుమార్ స్పందిస్తూ పరిమితికి మించి లోడుతో వెళ్లకుండా చూడాలని, అదేవిధంగా హెవీ వెహికల్స్ వెళ్లేందుకు నిర్దిష్టంగా కొన్ని మార్గాలను గుర్తించి ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు కాంట్రాక్టు సంస్థకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మాట్లాడుతూ .. ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం , పుల్లలచెరువు వెళ్లే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, ఈ నిర్మాణ పనుల పైనా దృష్టి పెట్టాలని కోరారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒంగోలు నగరంలోకి వచ్చే మార్గంలో ప్యాచ్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయని, వీటిని సత్వరమే పూడ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మ్యారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ మర్రిపూడి నుంచి పొదిలి వెళ్లే రోడ్డు కూడా దెబ్బతిందని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
చరిత్రలో తొలిసారి
సంక్షేమ హాస్టల్లో అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి స్వామి తెలిపారు. చరిత్రలో ఎన్నడు లేని రీతిలో హాస్టళ్ళలో మరమ్మతు లకు నిధులు మంజూరు చేశామన్నారు. జిల్లా మినరల్ ఫండ్స్ కూడా అవసరాన్ని బట్టి హాస్టల్లో నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు. మరమ్మతులు చేస్తూనే అవసరమైనచోట దశలవారీగా కొత్త హాస్టల్లో నిర్మిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు బిపిటి బియ్యంతో భోజనం పెడతామన్నారు. సామాజిక తరగతితో సంబంధం లేకుండా సంక్షేమ హాస్టళ్ళలో అర్హులకు ప్రవేశం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ........అల్లి నగర్ లోని బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందని , సమీపంలోని పాఠశాలలో అదనపు తరగతి గదిలోకి విద్యార్థులను తరలించే విషయాన్ని పరిశీలించాలని కోరారు. సంతనూతలపాడు శాసనసభ్యులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టల్ నిర్మాణానికి మినరల్ ఫండ్స్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
సాంకేతిక సమస్యలకు పరిష్కారం
దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందే విషయంలో లబ్ధిదారులకు సాంకేతిక సమస్యలు ఎదురైతే సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి స్వామి అధికారులకు స్పష్టం చేశారు. దర్శి శాసనసభ్యులు మాట్లాడుతూ ........రేషన్ షాపుల నిర్వాహకులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉదంతాలపై దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
సూర్య ఘర్ పై విస్తృత అవగాహన
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. రైతులకు నిరంతరాయంగా తొమ్మిది గంటలు సరఫరా చేస్తున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేస్తున్న వారితోపాటు వాటిని కొనుగోలు చేసే వారి పైనా కేసులు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సూర్య ఘర్ పథకం లో భాగంగా సౌర విద్యుత్ వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. ఎర్రగొండపాలెంలోని గిరిజన ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేని 1700 నివాసాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే 1000 గృహాలకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మిగతా గృహాలకు విద్యుత్ లైన్ వేయడానికి అటవీ శాఖ అనుమతులు లేనందున సౌర విద్యుత్ వినియోగాన్ని బ్యాటరీ బ్యాకప్ ద్వారా స్థానికులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ పొరపాటు లేకపోయినప్పటికీ కరెంటు షాకుతో చనిపోయిన వారికి మానవతా దృక్పథంతో తమ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ............ కొండపి నియోజకవర్గం లో దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయటానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా గత నెల రెండో తేదీన జరిగిన జిల్లా ప్రజా పరిషత్ 7 స్థాయీ సంఘాల సమావేశంలో చేసిన తీర్మానాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పరిషత్తుకు రూ.768,33,59,019 అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలను సీఈవో చిరంజీవి ప్రతిపాదించారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ కు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చీరాల శాసనసభ్యులు ఎం. మాల కొండయ్య, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


