మెరుగైన జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. గురువారం ఆమె మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ సహదిత్ త్రివినాగ్ తో కలిసి పెద్దారవీడు మండలం బద్వీడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రగల్లపాడు హ్యాబిటేషన్ ను సందర్శించారు. స్థానికంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఫారం పాండ్ తవ్వకం పనులను ఆమె పరిశీలించారు. కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు రోజుకు 260 నుంచి 280 రూపాయల వరకు కూలీ వస్తున్నట్లు వారు తెలిపారు. ఉదయం సమయంలో స్థానికంగా మిరప తోటల్లో పనులకు వెళుతున్నామని, సాయంత్రం వేళ ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నట్లు కలెక్టరుకు వివరించారు. ఈ విధంగా వస్తున్న డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకొంటున్నామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్థానికంగా చేపడుతున్న ఉపాధి హామీ పనులను మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. తమ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉన్నదని, హైస్కూలు కావాలని, గ్రామంలో మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు కోరగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ , ఇతర అధికారులు ఉన్నారు.


