తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. గురువారం మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ తో కలిసి ఆమె దోర్నాల మండలంలో పర్యటించారు. చిన్న దోర్నాల గ్రామంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. స్థానికంగా ఉన్న మంచినీటి పథకాలు ఎండిపోయాయని, ఈ గ్రామంలో 2వేల మంది జనాభా ఉన్నారని, 4 ఏజెన్సీల ద్వారా మొత్తం 20 మంచి నీటి ట్యాంకులను రవాణా చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు చెప్పారు. స్థానికంగా ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనుల వలన మంచినీటి పైపులు వేయటంలో జాప్యం జరుగుతున్నదని, ఆ పైపులైను త్వరగా వేస్తే సాగర్ నీటిని ఈ గ్రామానికి తీసుకురావచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ప్రతి ఇంటికీ
మంచినీటి కొళాయి కనెక్షన్ ఉన్నట్లు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పైపులైను పనులు త్వరగా పూర్తిచేసేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకరరావు, మండల స్థాయి అధికారులు ఉన్నారు.
దీనికి ముందుగా చిన్న గుడిపాడు, దోర్నాలలో జరుగుతున్న రీసర్వే తీరును కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు.









