ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 124 వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయములో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ …..పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో గురవయ్య మరియు మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కఠోర నిర్ణయంతో 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసి ప్రత్యేక రాష్ట్రం అవతరణతో పాటు, భారతదేశంలో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయినాడని, గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాలలో ప్రముఖపాత్ర వహించారని, సత్యము, అహింస ఆశయాలతో హరిజనుల ఉద్దరణకు పాటుపడ్డాడని, అందుకే ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆయన జీవితం నేటి తరానికి మార్గదర్శకమై భవ్య భావోన్నత భవిష్య నిర్మాణానికి ప్రేరణ అని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర, దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ. ఎస్. పి (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు తాలూకా అజయ్ కుమార్, ఆర్ఐ రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



