పాఠశాలల పనివేళలు మారాయి-ఐదు రోజుల్లో మూడు సార్లు మార్పు

పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల పనివేళలు మళ్లీ మారాయి. ఈనెల 17 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన ఐదు రోజుల్లో పాఠశాలల పనివేళలను మూడు సార్లు మారుస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈనెల 15 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహించేందుకు ఉదయం 7.45 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్ష జరిగిన రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించాలని, పరీక్షలేని రోజు యథావిధిగా నిర్వహించాలని కమిషనర్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆ ప్రకారమే రెండు రోజులు జరిగాక ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రంగప్రవేశం చేసి కమిషనర్ ఉత్తర్వులును తూచ్ అని పక్కన పెట్టి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలను పరీక్ష ముగిసే వరకు పరీక్ష ఉన్నా లేకున్నా పాఠశాలలను మధ్యాహ్నం 1.30 నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష లేని రోజుల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఎండకు పాఠశాలలకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది కలుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. శుక్రవారం పాఠశాల విద్యా కమిషనర్ నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో పలువురు సంఘ నాయకులు సమస్యను కమిషనర్ కు వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ విషయాన్ని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కు చెప్పి వెంటనే పనివేళలు సవరించమని ఆదేశించారు. దీంతో గత్యంతరం లేక ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి పాఠశాలల పనివేళలను మళ్లీ సవరించారు. పరీక్ష ఉన్న రోజు మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్నం తరగతులు నిర్వహించాలని, పరీక్షలేని రోజుల్లో యథావిధిగా ఉదయమే తరగతులు నిర్వహించాలని అదేశాలు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *