బేగంపేట ఏప్రిల్ 7(జె ఎస్ డి ఎం న్యూస్) :
ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో ముగ్గురు పేద విద్యార్థులకు సనత్ నగర్ కు చెందిన సంకేత్ సోషల్ అవేర్ నెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2.45 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. గిర్కాల శ్రావణి ఎం ఎస్ మొదటి సంవత్సరం చదువు కోసం 2 లక్షల రూపాయలు, దత్తా ఇంటర్మీడియట్ కోసం 20 వేలు, వీరు ఇంటర్మీడియట్ చదువు కోసం 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందులు, పేదరికం కారణంగా అనేకమంది మధ్యలోనే తమ చదువులకు ముగింపు చెబుతున్నారని, ఇది బాధాకరం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి విద్యావంతులను చేయడం ద్వారా వారికి బంగారు భవిష్యత్ ను అందించిన వారవుతారని చెప్పారు. పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఆర్ధిక సహాయం అందిస్తున్న సంకేత్ ఆర్గనైజేషన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఫౌండర్ మురళి, అధ్యక్షులు మమత, ఉపాధ్యక్షులు ధన శ్రీ తదితరులు పాల్గొన్నారు.


