జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశమై జిల్లాలో పీ.ఎం. సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1115 దరఖాస్తులు గ్రౌండింగ్ చేయగా, 736 మందికి సబ్సిడీ జమ కావడం జరిగిందన్నారు. నియోజక వర్గానికి 10 వేల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, అందుకనుగుణంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాలికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో తూర్పు నాయుడుపాలెం, శంఖవరం, నాగంబొట్లపాలెం, సింగరాయకొండ, బేస్తవారిపేట గ్రామాలను ప్రత్యేక గ్రామాలుగా ఎంపిక చేసి 5 గ్రామాలలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడైనా సబ్సిడీ రిలీజ్ చేయడంలో సమస్యలు ఉంటే వెంటనే ఎల్డిఎం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో అన్నీ వర్గాల ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని గ్రామాల్లోనూ సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగం వలన కలిగే ప్రయోజనాలను, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని ప్రజలకు వివరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వెండర్స్ వారిగా రిపోర్ట్ అందించాలని, వెండర్స్ అందరూ వారికి కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఈ పథకం అమలులో ప్రతిరోజు పురోగతి రావాలని, రోజువారిగా సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏపిసిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిఆర్డిఏ పిడి నారాయణ, ఎల్డిఎం రమేష్, సోలార్ విద్యుత్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

