అనీమియా (రక్తహీనత) లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పక్వాడా ) ముగింపు సందర్బంగా మంగళవారం ఉదయం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఐసిడిఎస్ పిడి హేన సుజన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, డిఆర్ డిఎ, మెప్మా పిడీలు నారాయణ, శ్రీహరి, ఐసిడిఎస, ఆశా కార్యకర్తలు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి మిని స్టేడియం వరకు సాగింది.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…. బాల్యం చాలా విలువైందని, పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఆరోగ్యమైన జీవితాన్ని పిల్లలకు అందించే లక్ష్యంతో జిల్లాల్లో శిశు, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా వున్నాయని, బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నింటిని సమీకృతం చేసి రోజుకొక అంశతో ఈ నెల 8 తేదీ నుండి ఈ రోజు వరకు 22వ తేదీ వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పక్వాడా ) ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. బిడ్డ పుట్టిన తరువాత మొదటి 1000 రోజులు చాలా విలువైందని, అ రోజుల్లో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడం, పిల్లల్లో మనో వికాసం పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం, గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికల్లో అనీమియా (రక్తహీనత) లేకుండా చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అందుకు గాను ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ మరియు విద్యా శాఖలు కీలక పాత్ర పోషిస్తూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో మనో వికాసం పెంపొందించేలా కలెక్టరేట్ లో జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని మరియు చంటి బిడ్డలకు తల్లులు పాలిచ్చు గదిని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికల్లో అనీమియా (రక్తహీనత) లేకుండా చేయడానికి తీసుకోవాల్సిన పోష్టికాహారంపై అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. వీటిని మారుమూల గ్రామాల్లో, గిరిజన, చెంచు గ్రామాల్లో పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. … జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు రోజుకొక అంశాన్ని తీసుకొని పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పఖ్వాడా) ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా తల్లిపాలు పై అవగాహన మరియు కౌన్సెలింగ్ ఇవ్వడం, సెక్రటేరియట్ స్థాయి విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి 1000 రోజుల (గర్భస్త దశ నుండి 2 సంవత్సరాల వరకు బిడ్డ సంరక్షణపై శ్రద్ధ వహించుట, గర్భధారణ సమయంలో బరువు పెరిగేలా చూసుకోవడం, గర్భిణీ తల్లికి హిమోగ్లోబిస్ స్థాయిని మెరుగుపరచడం, గర్భిణీ తల్లి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం, తల్లి మరియు బిడ్డను కాపాడటానికి కుటుంబం మరియు సమాజం నుండి మద్దతును నిర్ధారించడం, మెరుగైన పోషకాహారం మరియు సకాలంలో టీకాలు వేయడం, తల్లి మరియు శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శిశువు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహార పద్ధతులపై తల్లి మరియు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ రోజు కలెక్టరేట్ లో చంటి బిడ్డలకు తల్లులు పాలిచ్చు గదిని ఏర్పాటుచేసుకోవడం జరిగిందన్నారు. అనీమియా (రక్తహీనత) లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చి దిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తొలుత మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన చంటి బిడ్డలకు తల్లులు పాలిచ్చు గదిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని మంత్రి డా. బాల వీరాంజనేయ స్వామి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి తిలకించారు.




