కంటోన్మెంట్ ఏప్రిల్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్ ):
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకేంద్రం లో ఉన్న సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.కంటోన్మెంట్ వార్డు 3, బాలంరాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం సందర్శించారు. అక్కడ ఉన్న సౌకర్యాలను, పిహెచ్సి కి వచ్చే ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.
పిహెచ్సి నిర్వహిస్తున్న విధానం పట్ల ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్లు అధికంగా వస్తున్న నేపథ్యంలో సిబ్బంది విజ్ఞప్తి మేరకు అదనపు బెడ్లు ఏర్పాటు చేయడానికి పక్కనే ఉన్న గదులను కూడా పిహెచ్సి కి కేటాయించాల్సిందిగా కంటోన్మెంట్ సిఇవో మధుకర్ నాయక్ తో మాట్లాడారు.
ప్రజాసేవకు తాను ఎప్పుడూ ముందుంటానని ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎలాంటి అవసరం ఉన్నా తాను అందుబాటులోనే ఉంటానని ఎమ్మెల్యే సిబ్బందికి, ప్రజలకు హామి ఇచ్చారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
