ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
చెప్పారు. ఈ దిశగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గాలి దుమారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సోమవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి విపత్తుల సమయంలో గ్రామస్థాయి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పిడుగుపాటుకు దారితీసే పరిస్థితులు, ఆయా సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డప్పు చాటింపుతో పాటు ప్రసార మధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాతావరణ మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న హెచ్చరికలను గమనించి ఆయా విషయాలను ప్రజలకు చేరవేయాలని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, జిల్లా కేంద్రం నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *