మన్యం వీరుడు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
అన్నారు.
అల్లూరి సీతారామరాజు వర్దంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలులోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బి.ఎన్.విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ శ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, పలు సంఘాల నేతలు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ…. స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్య్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.
ఒంగోలుశాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురునిలిచి అడవి బిడ్డలకు అండగా నిలిచి 27 సంవత్సరాల వయస్సు లోనే ప్రాణత్యాగం చేసిన యోధుడు అల్లూరి అన్నారు. బ్రిటిష్ వారికి చెప్పి వారి ఆయుధాలు కొల్లగొట్టిన మొనగాడు సీతారామరాజు అని అన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బి.ఎన్.విజయకుమార్ మాట్లాడుతూ, అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని వీరిని స్పూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.
ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ… స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదురొడ్డి వీరోచితంగా ప్రాణాలు విడిచిన మహానాయకుడు అల్లూరి సీతారామరాజు అని, వీరు చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి అంజల, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.


