స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి గా పేరుగాంచిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ… ప్రకాశం పంతులు గారు 1872 ఆగష్టు 23 న ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, వినోదరాయుని పాలెం గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించారన్నారు. చిన్నతనంలో కష్టపడి విద్యాబ్యాసం చేసి లండన్ లో బారిష్టర్ పాసై ప్రముఖ న్యాయవాదిగా సేవలందించారని, గొప్ప దేశభక్తుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, మేధావి, ధీరుడు, కార్యదక్షుడని, మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ పోలీసుల తుపాకీ తూటాలకు ఎదురుగా గుండె చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేనిదని, ప్రత్యేకంగా రాష్ట్ర సాధనలో నిర్ణయక పాత్ర పోషించాడని, 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రజాసేవకుడయ్యారని, ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు ఎప్పటికీ ఆదర్శప్రాయమన్నారు. తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారని, ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు, నిబద్ధత, ధైర్యం, సమైక్యతకు నిలువెత్తు నిదర్శనమని, అలాంటి మహనీయుని జీవితాన్ని, ధైర్యసాహసాలు, పోరాట పటిమను నేటి, భావితరాలు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐ రమణారెడ్డి , ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, పాపి రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.



