జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని.. యోగాంధ్ర-2025 మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగ సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యోగ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
యోగాంధ్ర-2025 మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రకాశం భవనం ఎదురుగా ఏర్పాటుచేసిన యోగ రోడ్డు లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, నగర కమీషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు లతో కలసి యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంను విశాఖపట్నంలో జరుపుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి , రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనుచున్నారని, ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని యోగా మంత్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగ సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా రోజుకొక కార్యక్రమంతో యోగ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రధాన మునిసిపాలిటీలలో, మండల కేంద్రాల్లో ఒక రోడ్డును యోగ రోడ్డు గా ప్రకటించి ఆ రోడ్డులో ప్రతి రోజు ఉదయం యోగ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సాధన చేసేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో 100 మంది మాస్టర్ ట్రైనర్స్ ను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అలాగే మండల స్థాయిలో 200 మంది ట్రైనర్స్ ను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ యోగ రోడ్డు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మునిసిపల్ శాఖ సిబ్బంది, యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు.




