యోగాంధ్ర కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లవరం ప్రాజెక్ట్ పరిసరాలు – యోగాసన కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ,ఎమ్మెల్యే బి.ఎన్

ప్రకాశం జిల్లాలో త్రాగు, సాగునీటి అవసరాలు తీరుస్తూ భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా ప్రజల జీవన విధానంతో మమేకమై ముందుకు సాగుతున్నది…  గుండ్లకమ్మ నది! ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టు దీనికి ఒక మకుటం. ఈ రిజర్వాయర్ పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ఈ ప్రాంతానికి మరింత శోభాయమానంగా విరాజిల్లుతోంది.
ప్రశాంత వాతావరణంతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం సోమవారం ఉదయం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచి జిల్లా ప్రజల దృష్టిని ఆకర్షించింది. యోగాంధ్ర – 2025లో భాగంగా జిల్లా యంత్రాంగం ఇక్కడ యోగాసన కార్యక్రమం నిర్వహించడమే దీనికి కారణం !! ఔను… మందిర ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని యోగాసనాలు వేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు.  ఈ యోగాభ్యాసన కార్యక్రమంలో 400 మందికిపైగా పాల్గొన్నారు.
               ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …శ్వాస మీద ధ్యాస ఉంచి మనసును, తనువును ఏకం చేసే ప్రక్రియే యోగాభ్యాసనం అన్నారు. ఒత్తిడితో కూడిన నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతితో మమేకం అవుతూ యోగా సాధనే దీనికి ఉత్తమ మార్గం అని ఆమె తెలిపారు. యోగా వలన కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రజల్లో దీని పట్ల మరింత ఆసక్తి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించి వారికి కూడా ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
             ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… సంతోషం, ఆరోగ్యం, సంపన్నవంతమైన సమాజ ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రజల
ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. యోగాభ్యాసనం ఇందులో ఒక భాగం అని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా నెల రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జూన్ 21వ తేదీన జిల్లాలో 10 లక్షల మంది యోగాసనాలలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
             ఈ కార్యక్రమంలో డీఈవో కిరణ్ కుమార్, డి.ఎం.హెచ్.ఓ. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఆయుష్ అధికారి బైద్యనాథ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు పద్మజాతి, శిరీష, మందిర ఈవో నాగేశ్వరరావు, పతంజలి యోగా సంస్థ ప్రతినిధులు
సుధీర్, రవి, గుప్తా, నాగేశ్వరరావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ హజీరా,  మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ, వైద్య శాఖల సిబ్బంది పాల్గొన్నారు.   

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *