ప్రజల సంక్షేమము, జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి – జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ

ప్రజల సంక్షేమము, జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. శనివారం ఆమె అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం స్థానిక దక్షిణ బైపాస్ రోడ్ సెంటర్ లోని జెడ్పి సమావేశ మందిరంలో జరిగింది. గ్రామీణ నీటి సరఫరా, డ్వామా , డి. ఆర్. డి. ఎ , విద్య, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా అందుతున్న సేవలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో చట్టసభ సభ్యులు, జడ్పిటిసి లు , ఎంపీపీ లు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు ఆర్.గోపాలకృష్ణ,
జడ్పీ సీఈవో చిరంజీవి, బాపట్ల, నెల్లూరు జిల్లాల డిఆర్వో లు గంగాధర్ గౌడ్, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. ఒంగోలు ఎం.పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు ఉగ్రనరసింహారెడ్డి, బి. ఎన్. విజయ కుమార్ రెడ్డి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ హాజరై ఆయా శాఖలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ బాలశంకర రావు మాట్లాడుతూ… జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాగర్ నీటితో అన్ని నీటి చెరువులను నింపుతున్నట్లు చెప్పారు. తాగు నీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు విడుదల చేసిందన్నారు. గుండ్లకమ్మ, రామతీర్ధం, వెలిగండ్ల ప్రాజెక్ట్ ల నుంచి జలజీవన్ పధకం కింద చేపట్టిన పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ పనులను కేంద్ర నోడల్ అధికారులు కూడా గురు, శుక్ర వారాలలో జిల్లాలో పర్యటించి పరిశీలించినట్లు చెప్పారు. డ్వామా పీడీ
జోసఫ్ కుమార్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్ధిక సంవత్సరం లో ఇప్పటివరకు 54 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. జిల్లాలో పశువులకు నీటి తొట్టెలు, గోకులం షెడ్డులు, ఫారం పాండ్స్, సోక్ పిట్స్ నిర్మాణాల పురోగతిని, పూడికతీత పనుల వివరాలను వివరించారు. “పల్లె పండుగ” కార్యక్రమం కింద చేపట్టిన పనులకు బిల్లులు వారం రోజులలో చెల్లిస్తామని చెప్పారు. డి .ఆర్. డి .ఎ పి డి
నారాయణ మాట్లాడుతూ… ఎస్ హెచ్ జి మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరం లో రుణాల మంజూరు లక్ష్యాన్ని, జిల్లాలో “లఖ్ పతి దీదీ” లుగా మహిళలను తీర్చి దిద్దేందుకు అమలు చేస్తున్న ప్రణాళికను వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ… స్కూల్స్ ప్రారంభించగానే “సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర” కిట్లు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, “మన బడి మన భవిష్యత్తు” కార్యక్రమం కింది పాఠశాలలలో అవసరమైన పనులు చేపడతామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ… “అన్నదాత సుఖీ భవ” పధకం కింద లబ్ధిదారుల ఖాతాలలో జూన్ 3 వ వారంలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ఉద్యాన రైతులకు ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… రక్షిత మంచి నీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పని చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. అవసర మైతే వచ్చే రెండేళ్లలో 100 ఆర్వో ప్లాంట్లు వచ్చేలా తాను చూస్తానన్నారు. రక్షిత మంచి నీటిని సరఫరా చేసే పైపు లైన్ల మరమ్మతులు / కొత్త వాటికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక కోటి రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటికే సచివాలయాలకు తాను ఇచ్చిన 15 ట్యాంకర్లను స్వాదీనం చేసుకుని వినియోగించుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. రాష్ట్రము లో జలజీవన్ మిషన్ పనులను పూర్తి చేసే గడువును ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 2028 వరకు పెంచినందున ఈ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. రైతుల వద్ద పొగాకు నిల్వలు భారీగా ఉన్నందున మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. కొత్త జెడ్పి సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు.

కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ… కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు తోడు సాగర్ నీటిని పంపిణీ చేసే పైపు లైన్లు దెబ్బతిన్నందున కొత్త పైపు లైన్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ లు అందేలా చూడాలన్నారు. హెచ్ఎం పాడు మండలంలో తక్కువ వర్షపాతం నమోదైనా కరువు మండలంగా ప్రకటించలేదని, కరువు మండలంగా ప్రకటించేందుకు పునఃపరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు ఆయన చెప్పారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్.విజయ కుమార్ మాట్లాడుతూ ….తన నియోజకవర్గంలో సి పి డబ్ల్యూ ఎస్ పధకాల నిర్వహణ పై మరింత దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. రామతీర్ధం, గుండ్లకమ్మ కాలువలు బాగు చేయించాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్ నెలాఖరుకు పూర్తి చేయక పోతే నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం ఉండదన్నారు.
దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పధకంలో జాబ్ కార్డులు కలిగి, అడిగిన వారందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా పని కల్పించాలని అన్నారు. తన నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన ఉద్యాన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ మాట్లాడుతూ …తన నియోజకవర్గం లోని గురిజేపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు బొప్పాయి పంటను నష్ట పరిచారని, బాధిత రైతుకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను అడిగారు. వెలిగొండ ప్రాజెక్ట్ పునరావాస ప్యాకేజి జాబితాలో 320 మంది పేర్లు లేవని, పరిశీలించి వాటిని చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన చెప్పారు.

పలువురు జడ్పీటీసీ లు, ఎంపీపీ లు మాట్లాడుతూ స్కూల్స్ లో విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కోరారు. చీమకుర్తి బాలికల హాస్టల్ లో భోజనం నాణ్యత పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో ఫ్లోరైడ్ తాగు నీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని, రామతీర్ధం ప్రాజెక్ట్ కు వెళ్ళే దారిలో వున్న ముళ్ళ చెట్లను తొలగించాలని, స్మశానాల లోనూ ముళ్ళ చెట్లను తొలగించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మండలాలలో ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు.

జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా హక్కు చట్టం అమలు, అర్హతల పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పునరావాస ప్యాకేజి జాబితాలో పేర్లు లేని వారి అర్హతను పరిశీలించేందుకు గ్రామసభలు పెట్టామన్నారు. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని యోగా సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు.

జడ్పీ సీఈఓ మాట్లాడుతూ సవరించిన మార్గదర్శకాల మేరకు స్టాండింగ్ కమిటీ, మండల పరిషత్ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు, జిల్లా పరిషత్ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.10 లక్షల నుంచి 25 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. కొత్త జెడ్పి సమావేశ మందిరం నిర్మాణానికి గతంలో రూపొందించిన రూ.20 కోట్ల అంచనాలను సవరించేందుకు, గత రెండు స్టాండింగ్ కమిటీలలో ఆమోదించిన 350 ప్రతిపాదనలకు కూడా ఈ సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *