భారతీయ వారసత్వ సంపద అయిన యోగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంతమవుతుందని జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం బీచ్ నందు యోగాంధ్ర – 2025 లో భాగంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగ విశిష్టత ను గుర్తించి ఐక్యరాజ్య సమితి 2014 న జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించగా అప్పటి నుండి 10 అంతర్జాతీయ యోగ దినోత్సవాలను జరుపుకున్నామన్నారు. ఈ ఏడాది జూన్ 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్ లో జరిగే యోగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొననున్న నేపథ్యంలో యోగ దినోత్సవ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే గత నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ ను రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగ శిక్షణ కార్యక్రమాలు, కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా యోగ రోడ్డు ను ఏర్పాటు చేసి ప్రతి రోజూ యోగ సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగంచేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మల్లవరం, త్రిపురాంతకం పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ రోజున సుమారు రెండు వేల మందితో కొత్తపట్నం బీచ్ నందు యోగ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం సింగరాయకొండ మండలం, పాకల బీచ్ లో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 20వ తేదీన సుమారు పది వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రత్యేక యోగ కార్యక్రమాన్ని జరుపుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో కనీసం పది లక్షల మందిని యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములు చేసే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్దఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగ ను భాగంగా చేసుకుని 45 నిమిషాల పాటు యోగాను రోజూ ఆచరించినట్లైతే జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చన్నారు. ప్రతి రోజూ యోగ సాధన వలన హెల్త్ ఇండికేటర్స్ కు పెంపొందిపబడుతాయన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓ వెంకట నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, పశుసంవర్ధక శాఖ డి డి రవి కుమార్, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, తహసీల్దార్ మధుసూదన్ రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

