రైతులకు అన్నివేళలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ మరియు పొగాకు బోర్డు ఆధ్వర్యంలో బుధవారం త్రోవగుంటలో వేరువేరుగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొగాకు వేలం కేంద్రం సమీపంలోని పొలంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్, వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, కార్యదర్శి వేణుగోపాల్, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి పాల్గొన్నారు. నాగలితో పొలం దున్ని రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ… ఒక రైతు బిడ్డగా అన్నదాతల కష్టం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ను కూడా తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ దిశగానే అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. గతంలో రైతులకు వ్యక్తిగతంగా అండగా ఉండేలా రాయితీపై పరికరాలను తమ ప్రభుత్వం అందించింది అన్నారు. నేడు కూడా రాయితీపై వ్యవసాయ పరికరాలను రైతులకు అందించేందుకు 146 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. మ్యాచింగ్ గ్రాండ్స్ లేని కారణంగా గత ప్రభుత్వంలో నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తమ ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేసిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 20వ తేదీన అమలు చేసి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చుతామని మంత్రి చెప్పారు. ఫ్రీ హోల్డ్ భూముల క్రమబద్ధీకరణ పేరుతో గతంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వం సరిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్లు చెప్పారు. పొగాకు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లోగ్రేడు పొగాకును కూడా కంపెనీలు కొనుగోలు చేసేలా చూడాలని పొగాకు బోర్డు చైర్మన్ ను మంత్రి కోరారు. ఇప్పటికే మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పొగాకుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులెవరూ కూడా నష్టపోకుండా ధరల స్థిరీకరణ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
మంత్రి రవికుమార్ మాట్లాడుతూ …గత రెండేళ్లుగా పొగాకు కొనుగోలుదారులు మంచి లాభాలు ఆర్జించారని, ఈ ఏడాది కూడా సాగుచేసిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. ప్రస్తుతం హై గ్రేడు, మీడియం గ్రేడ్ పొగాకును కొనుగోలు చేస్తున్నారని, లో గ్రేడును కూడా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నల్లబర్లి రకం పొగాకును ఈనెల 16వ తేదీ నుంచి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమది రైతు ప్రభుత్వం అని, మామిడి, కోకో, ఆయిల్ పామ్ రైతులకు సమస్యలు వస్తే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకున్నదని చెప్పారు. పొగాకు రైతులకు కూడా దన్నుగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పద్ధతులను అమలు చేయడం ద్వారా దిగుబడి పెంచుకోవచ్చని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ప్రకృతి సేద్యం విధానానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ… రైతులను ఆదుకోవడంలో కంపెనీలు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. అలాగాకుండా కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తామంటే సరికాదన్నారు. స్థానిక పరిస్థితులను కంపెనీలు తమ యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వము, బోర్డు తమను ఆదుకోవడం లేదనే అభిప్రాయంలో పొగాకు రైతులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ముందుగా పొగాకు బోర్డు, ఐటిసి అవసరమైన చర్యలు తీసుకొని లోగ్రేడ్ పొగాకు కూడా కొనుగోలు చేసేలా చూడాలన్నారు.
పొగాకు బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం 60 నుంచి 70 మిలియన్ కేజీల లోగ్రేడ్ పొగాకు ఉన్నట్లు చెప్పారు. బోర్డు ఎల్లప్పుడూ రైతుల పక్షమే ఉంటుందన్నారు. లోగ్రేడ్ పొగాకును కూడా కంపెనీలు కొనుగోలు చేసేలా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి గోపీచంద్, మార్క్ఫెడ్ డి.ఎం. హరికృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ , ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, ఏపీ సి.పి.డి.సి. ఎల్. ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు , స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




