మహంకాళి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి…….మహంకాళి ఆలయ పరిసరాల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే తలసాని.

హైదరాబాద్ జూన్ 21(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాయినీ మహంకాళి ఆలయ పరిసరాలలో పర్యటించారు. కాలినడకన తిరుగుతూ ఆలయ పరిసరాలను పరిశీలించారు. స్థానికుల ద్వారా పలు సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆలయం వద్ద పండితులు స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా ప్రకటించిందని చెప్పారు. ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలు అంటేనే గోల్కొండ, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ ప్రాంతాలలో ఎంతో సందడి నెలకొంటుందని అన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించే మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని అన్నారు. తెల్లవారు జామున 3 గంటల నుండే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని అన్నారు. ఒక్క హైదరాబాద్ నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దర్శనం కోసం క్యూ లైన్ లలో వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, వాటర్ ప్యాకెట్ ల పంపిణీకి అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బంది తో పాటు, షీ టీమ్ లు, మఫ్టీ పోలీసులను నియమించాలని, సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలో రోడ్ల మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని అన్నారు. జోగినీలు, శివ సత్తులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశం తో
కే సి ఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మహంకాళి ఆలయానికి ప్రతి సంవత్సరం బోనాల నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేసినట్లు వివరించారు. భక్తులకు స్వచ్చందంగా సేవలు అందిస్తున్న దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్ తదితర స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రజలు, వ్యాపారుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి సి డాకు నాయక్, ఈ ఈ సుబ్రహ్మణ్యం, ఆర్ అండ్ బి ఈ ఈ రవీంద్ర మోహన్, సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్, వాటర్ వర్క్స్ జి ఎం వినోద్, ఎలెక్ట్రికల్ ఏ డి దుర్గాప్రసాద్, మహంకాళి సి ఐ పరశురాం, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, విజయ్ చారి, పబ్బా ప్రకాష్, సంజయ్, మహేష్ యాదవ్, మహేందర్, కోటేశ్వర్ గౌడ్, సతీష్, సత్యనారాయణ, దక్కన్ మానవ సేవ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *