ఒత్తిడిని జయించే సాధనం యోగా అని రోజువారీ యోగా అలవాటు చేసుకోవాలని, పోలీసు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ పేర్కొన్నారు.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా శనివారం ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ , పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. యోగా గురువు సూచనలను అనుసరిస్తూ వివిధ యోగాసనాలను సాధన చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ రూపాయి ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాల్లో యోగా సాధన ప్రధానమైనదని తెలిపారు. ప్రధానిమంత్రి , ముఖ్యమంత్రి విశాఖలో యోగా డే సందర్భంగా 5 లక్షల మందితో యోగా సాధన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యోగ కార్యక్రమంలో ప్రకాశం పోలీస్ శాఖ నిర్వహించటం జరిగిందని, యోగా భారతీయ సంస్కృతిలో భాగమని, మనం ప్రపంచానికి అందించిన విలువైన బహుమతుల్లో ఒకటని, యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శరీరం, మనసు మధ్య సమతుల్యం ఏర్పరిచే గొప్ప విన్యాసాలని, మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని, మంచి ఆరోగ్యం మరియు ఏకాగ్రతన పెంచుటలో సాధనమన్నారు. యోగా సాధన పెద్ద కష్టమేమి కాదని, ప్రతి చిన్న ఆసనం మన మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎండ మరియు వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి శారీరక, మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు యోగా అత్యంత ఉపయుక్తమైన సాధనమని, యోగా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మనమే కాదు మన ఇంటి కుటుంబ సభ్యులకు కూడా యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలన్నారు. యోగా ఒక సంజీవని లాంటిదని, కూర్చున్న చోటనే మనం చేసే ఆసనాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. కావున యోగాని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, దీనిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు, యోగ గురువు మువ్వల శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.



