జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డు లను మంజూరు చేసేలా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల్ క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల్ క్రిష్ణ , ఆర్డీఓలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, గృహనిర్మాణ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో సమావేశమై రెవెన్యూ అంశాలకు సంబంధించి పిజిఆర్ఎస్ పెండింగ్, కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డుల మంజూరు, రీ వెరిఫికేషన్ అఫ్ హౌస్ సైట్స్, హౌస్ సైట్ అప్లికేషన్స్, వాటర్ టాక్స్ కలెక్షన్, కోర్టు కేసుల పురోగతి, రీ సర్వే ప్రక్రియ, నిత్యావసర సరుకుల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షింఛి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కౌలు రైతులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, నిజమైన కౌలు రైతులకు సీసీఆర్సి కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 46,015 సిసిఆర్సి కార్డులు మంజురు చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగిందని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిజమైన కౌలు రైతులకు సీసీఆర్సి కార్డులు మంజూరు చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో, పిజిఆర్ఎస్ లో వచ్చిన రెవెన్యు అంశాలకు సంబంధించిన ఆర్జీల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీల పరిష్కారానికి సంబంధించి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా ఎండార్స్మెంట్ చేశారా లేదా పరిశీలన చేయాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి నివేశన స్థలాల కోసం ఎన్ని అర్జీలు వచ్చాయి, అందులో ఎన్ని అర్హత గలవి, ఎంత స్థలం అందుబాటులో వుంది తదితర వివరాలను గ్రామాల వారీగా పూర్తీ వివరాలతో నివేదిక సిద్దం చేయాలని జాయింట్ కలెక్టర్, తహసిల్దార్ల ను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇంటిపట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పై ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూముల రీసర్వే ప్రక్రియ రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమన్నారు. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించకుండా రీసర్వే ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వక క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. జిల్లా లో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అమలు జరగాలని, అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డిఓలు లక్ష్మిప్రసన్న, కేసవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, పౌర సరఫరాల శాఖ డిఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీ గౌస్ బాషా, వివిధ సెక్షన్స్ సుపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

