రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో భాగంగా పెండింగ్ ఈ-కేవైసీ మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి ఎంపీడీవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ ఈ పథకం కింద ప్రయోజనం దక్కడమే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ దృష్ట్యా సత్వరమే పెండింగ్ ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది బదిలీ అయ్యే జూలై 5వ తేదీ లోపు సిటిజన్ ఈ-కేవైసీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. ఎంపీడీవోలు ఈ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పీ-4 పథకంలో భాగంగా బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలని, అదే సమయంలో వీటికి అండగా నిలిచేలా మార్గదర్శకులను కూడా గుర్తించాలని ఆమె చెప్పారు. వర్షాల దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్రై సైకిళ్ళు, తోపుడు బండ్లు, ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసేందుకు నిచ్చెనలను స్థానిక ఫండ్స్ నుంచే సమకూర్చుకోవాలని చెప్పారు.
*8న మంత్రుల సమక్షంలో ప్లాంటేషన్*
ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని కలెక్టర్ చెప్పారు. ఫారం పాండ్స్, ఫిషింగ్ పాండ్స్, కంపోస్టు పిట్స్ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్వామా ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లాంటేషనుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఎకరాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మన జిల్లాలో 750 ఎకరాలలో మొక్కలు నాటాల్సి ఉన్నదని, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. జూలై నెలలో ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల పని దినాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ దిశగా కార్మికులను మొబిలైజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి వేతనం సగటున రూ.251గా ఉందని, దీనిని పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హౌసింగ్ స్కీములో ప్రతివారం ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి ఉండేలా ఎంపీడీవోలు, హౌసింగ్ ఏ.ఈ.లు సమన్వయంతో పర్యవేక్షించాలని ఆమె చెప్పారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, హౌసింగ్ పీ.డీ. శ్రీనివాస ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

