స్వాతంత్య్ర సమరయోధుడు, నిస్వార్థ దేశభక్తుడు, విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… అల్లూరి “సీతారామరాజు భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయుడు, మన్యం వీరుడు అని, ఆయన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టేందుకు పరిమిత వనరులతో సాగించిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని అన్నారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి ఆయనే అని, ఆయన దేశభక్తి, జాతీయవాద స్ఫూర్తి భారతీయుల హృదయాల్లో జ్వాలలు రేకెత్తించిందన్నారు. దేశంలో బ్రిటిష్ పాలకుల దోపిడీ, దురాగతాలు, దమనకాండలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టేందుకు అనేకమందిని ప్రేరేపించిందని గుర్తుచేశారు. బ్రిటిష్ పాలకుల అక్రమాలపై తిరుగుబాటుకు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ జయంతి సందర్భంగా ఆ మహావీరుడిని మనమందరం ఒక్కసారైనా స్మరించుకుందాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వర రావు, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


