పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ' నేను అండగా ఉంటాను ' అని ముందుకు వచ్చారు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ. ' మీ కుటుంబ సర్వతోముఖాభివృద్ధికి బాసటగా నిలుస్తాను ' అని భరోసా ఇచ్చారు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదప్రజలకు, పై స్థాయిలో సంపన్నులుగా ఉన్న 10% ప్రజలు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకం పీ - 4. ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా వ్యక్తిగతంగా తాను కూడా పేదలకు అండగా నిలుస్తాను అంటూ ముందుకు వచ్చారు గోపాలకృష్ణ !
ఇందులో భాగంగా శుక్రవారం మద్దిపాడు మండలం, మల్లవరం గ్రామంలో ఆయన పర్యటించారు. దళితురాలైన గొల్లపాటి మరియమ్మ కుటుంబాన్ని కలెక్టర్ సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కూర్చుని ప్రత్యేకంగా వారితో మాట్లాడారు. తన భర్త చనిపోయారని, కుమార్తె , కుమారుడు ఉన్నారని, కూలి పనులు చేసుకునే తమకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు మరియమ్మ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు.
వారి కుటుంబ పరిస్థితిని, ఆర్థిక స్థితిని అడిగి తెలుసుకున్న కలెక్టర్... వారసత్వంగా వచ్చిన స్థలంలో కట్టుకోవడానికి తక్షణమే ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు సహాయం కూడా చేస్తానని చెప్పారు. జీవనోపాధి కోసం కిరాణా షాపు గానీ, టిఫిన్ షాపు గానీ ఆసక్తి మేరకు మరియమ్మ ఏర్పాటు చేసుకునేటట్లు సహాయం చేస్తానని కలెక్టర్ తెలిపారు. ఆమె కుమార్తెకు క్రాఫ్ట్ వర్క్, టైలరింగ్ లో ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్న కలెక్టర్ ... ఆ రంగంలోనూ రాణించేలా తోడుగా ఉంటానని చెప్పారు. ఇంటర్మీడియట్లో ఆగిపోయిన కుమార్తెను ఆ కోర్సు పూర్తి చేయించేలా చదివిస్తానన్నారు. కుమారుడు పదో తరగతి చదువుతున్నట్లు మరియమ్మ చెప్పారు. పేదరికం నుంచి కుటుంబం బయటపడేలా అవసరమైన సహాయం చేస్తానని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తొలుత నెల రోజులకు సరిపోయేలా కిరాణా సరుకులు, బియ్యం, కూరగాయలను కలెక్టర్ అందించారు.
గ్రామంలో శ్మశాన వాటిక సమస్య ఉన్నదని, మురుగు కాలువలు లేవని స్థానికులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకువచ్చారు. శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక తహసిల్దార్ ఆదిలక్ష్మిని ఆయన ఆదేశించారు. దశలవారీగా గ్రామంలో మురుగునీటి కాలువలను తవ్వించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో జ్యోతిని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, గ్రామ సర్పంచి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.