ఈ నెల 15వ తేదీ నుండి 23 తేదీ వరకు జరగనున్న ఏపిపిఎస్‌సి పరీక్షలకు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బంధీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు,
అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని తమ ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, సంబంధిత అధికారులతో సమావేశమై ఈ నెల 15వ తేదీ నుండి 23 తేదీల్లో జరగనున్న ఏపిపిఎస్‌సి పరీక్షల ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. లెక్చరర్స్ , జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి ఎపిపిఎస్‌సి ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని మొత్తం 6 సెంటర్స్ లో పెద్దారవీడు మండలలోని దేవరాజుగట్టు వద్ద గల కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ నందు, మార్కాపురం లోని డాక్టర్ సామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నందు, ఒంగోలు నగరంలోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందు, వల్లూరు లోని రైజ్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నందు, రైజ్ క్రిష్ణ సాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నందు మరియు ఒంగోలు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా నందు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులను ఉదయం 8 నుంచి 9 గంటలు వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలు వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. వారు హాల్ టిక్కెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా తీసుకురావాలి చెప్పారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వాచీలు, పరికరాలను ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలవద్ద తగిన పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు, త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. శానిటేషన్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని మునిసిపల్ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఛీఫ్ సూపరింటిండెంట్లదే కీలక బాధ్యత అని డిఆర్ఓ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎపిపిఎస్‌సి సెక్షన్ ఆఫీసర్ విజయకుమార్, డిపిఓ వెంకట నాయుడు, పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ ప్రతినిధులు, ఛీఫ్ సూపరింటిండెంట్లు, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

