ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ స్ఫూర్తితో జిల్లాలో పి – 4 కార్యక్రమాన్ని అమలు చేయటంపై అధికారులు మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు సంబంధిత వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో పొందుపరచడంపై జిల్లా అధికారులకు గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో పాటు ఆయా అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన స్పర్ష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్
( పీ – 4 ) ఆలోచన, లక్ష్యాలతో పాటు స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమాలను స్పర్ష్ ఈ సందర్భంగా వివరించారు. పీ – 4 కోసం రూపొందించిన పోర్టల్ ను వివరించి, అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అదేవిధంగా అధికారులు చేసిన సూచనలను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పేదరికాన్ని అధికమించేందుకు వివిధ శాఖల వారీగా ‘ కీ పెరామీటర్ ఇండికేటర్స్ ‘, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించడంతో పాటు వీటిని దత్తత తీసుకునే మార్గదర్శకులను కూడా త్వరగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓ గొట్టిపాటి వెంకట నాయుడు, జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లా పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ వరలక్ష్మి, డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, ఇంచార్జ్ సిపిఓ స్వరూప రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

