దేశ రాజధాని న్యూఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, సి.ఆర్.మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ హామీ ఇచ్చారు.
న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఐజేయూ సభ్యుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీ ఏపీ, తెలంగాణా భవన్ సముదాయం లోని గురజాడ సమావేశ మందిరంలో టీవీ 5 ప్రతినిధి టి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. తాము ఎదుర్కుంటున్న సమస్యలను వివరిస్తూ, వాటిని పరిష్కారం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల మీడియా అకాడమీల చైర్మన్ లను ఆయన కోరారు. టీ.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, ఏపీ యూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు సమావేశంలో మాట్లాడుతూ డిల్లీ లోని తెలుగు జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్తామని, డిల్లీ జర్నలిస్టులకు అండగా ఉంటామనివారిద్దరూ హామీ ఇచ్చారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ గతంలో డిల్లీ తెలుగు జర్నలిస్టుల సంక్షేమానికి జరిగిన కృషిని, ఐజేయూ సాగించిన ప్రయత్నాలను వివరించారు.
అనంతరం డిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఐ. జే.యూ. స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం. ఎ.మాజిద్, జాతీయ కార్యదర్శులు వై.నరేందర్ రెడ్డి , డి.సోమసుందర్, టి.యు.డబ్ల్యూ.జే. ప్రధాన కార్యదర్శి కే.రామ్ నారాయణ్ పాల్గొన్నారు. ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు సమావేశంలో పాల్గొన్నారు.


