అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన దర్శి మండలం, తూర్పువీరాయపాలెం గ్రామానికి విచ్చేయుచున్న నేపథ్యంలో, అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలిసి దర్శిలోని తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లు పై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….అన్నదాత సుఖీభవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామంలో జరుగుచున్నందున, సదరు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేయుచున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కేటాయించిన విధులను తూచాతప్పకుండా పాటిస్తూ అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, సభాస్థలంలో డయాస్, బ్యారికేడింగ్, విఐపి మరియు పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుచున్నందున సంబంధిత శాఖల హెచ్ఓడి లు ఈ కార్యక్రమానికి వస్తున్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి రైతులతో ఇంటరాక్ట్ అవుచున్నందున సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డిఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, పశు సంవర్థక శాఖ జేడి రవి కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా…
తొలుత రాష్ట్ర సాంఘిక మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలసి తూర్పు వీరాయపాలెంలో పర్యటించి బహిరంగ సభ, హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలించి అధికారులకు ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లపై తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.



