ఫిర్యాదులను త్వరితగతిన విచారించి, చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారానే న్యాయం అందించగలమని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం” (మీ కోసం) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ముఖాముఖీగా మాట్లాడి ఫిర్యాదుల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా ఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్ ల సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో సత్వర చర్యలు తీసుకోవాలని,అలాగే పిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక ఇవ్వవలసిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, జాబ్ ఫ్రాడ్, కుంటుంబ సమస్యలు, చీటింగ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….
తనకు మరియు మరో 15 మందికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, ఒంగోలు ఇందిరా కాలనీకి చెందిన వ్యక్తి రూ.5,90,000/- తీసుకున్నాడు. ఉద్యోగాల పేరుతో లేఖను అందించి, దానితో ఆఫీసులను సంప్రదించగా ఎలాంటి ఉద్యోగాలు లేవని తెలిసింది. ఉద్యోగాలు ఇప్పించకపోగా తీసుకున్నా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఒంగోలు, సమతానగర్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదు.
తన అవసరాల నిమిత్తం బైక్ కావడంతో, ఒంగోలు ప్రాంతానికి చెందిన బైక్ డీలర్‌ను సంప్రదించగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉందని, ధర రూ.90,000/- అని తెలిపాడు. ముందుగా అడ్వాన్స్‌గా రూ.20,000/- తీసుకుని, మిగతా మొత్తం ఇఎంఐలో చెల్లించమని చెప్పగా, అతని మాటలు నమ్మి ఫోన్ పే ద్వారా రూ.20,000/- చెల్లించాడు. రెండు రోజుల్లో బైక్ డెలివరీ చేస్తానని చెప్పి, 15 రోజులు గడిచినా బైక్ ఇవ్వకుండా డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఒంగోలు రాజీవ్ నగర్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సి. సి. ఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
