ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగత , పరిసరాల శుభ్రత అత్యంత కీలకం – జిల్లా రెవిన్యూ అధికారి బి.చిన ఓబులేసు

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగత , పరిసరాల శుభ్రత అత్యంత కీలకమని జిల్లా రెవిన్యూ అధికారి (డీ.ఆర్.వో) బి.చిన ఓబులేసు
చెప్పారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని
పురస్కరించుకొని మంగళవారం స్థానిక పి.వి.ఆర్.  బాలుర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వైద్యాధికారులు వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.ఆర్.ఓ. మాట్లాడుతూ… నులిపురుగుల బారిన పడితే రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించటం, నీరసము, ఆందోళన, కడుపునొప్పి,  వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గటం  వంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నారు. దీని బారిన పడకుండా భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని విద్యార్థులకు చెప్పారు. చేతి గోళ్లు ప్రతివారం కత్తిరించుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం చిన్ననాటి నుంచే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. డి.ఎం. హెచ్.ఓ. డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్ల వయసు మధ్య గల వారు 5,96,751 ఉన్నట్లు చెప్పారు. ఈరోజు జిల్లావ్యాప్తంగా వీరికి ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వేయించుకోలేని వారికి ఈనెల 20వ తేదీన మాత్రలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఈ సందర్భంగా డిఆర్ఓ, డి.ఎం.హెచ్.ఓ., ఇతర అధికారులు స్వయంగా ఆల్బెండాజోల్ టాబ్లెట్లను వేశారు.
          ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ వాణిశ్రీ, జిల్లా క్షయ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి శ్రీవాణి, డి.ఐ.ఓ. కమలశ్రీ, డిపిఎమ్ఓ సౌజన్య, ఆర్.బీ.ఎస్.కే. డిపిఓ భగీరధి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉప విద్యాధికారి చంద్రమౌళీశ్వర్, ఆర్.ఐ.ఓ.  ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *