గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా చేపట్టిందని, నెల్లూరు జిల్లాలో ఉన్న కొండపి నియోజకవర్గంలోని పలు గ్రామాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై ఏర్పాటైన మంత్రుల కమిటీని కోరారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్య కుమార్ యాదవ్ లను కలిసి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వినతిపత్రం అందజేశారు. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం రామనాధపురం (ఎన్.వి.వి కండ్రిక) ఒక వీధి ప్రకాశం జిల్లా, మరొక వీధి పాలుకూరు పంచాయతీ నెల్లూరు జిల్లా పరిధిలో ఉందిని, దీనిని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నందనవనంలో కలపాలని కోరారు. జరుగుమల్లి మండలంలోని యడ్లూరిపాడు మండల కేంద్రానికి చాలా దూరంలో ఉందని, దీనిని పొన్నలూరు మండలంలో కలపాలని కోరారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు ఆవశ్యతను మంత్రి స్వామి వివరించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం పరిసర గ్రామాలు చాలా దూరంలో ఉన్నాయని, ఏదైనా పనుల మీద జిల్లా కేంద్రానికి ఈ ప్రాంత ప్రజలు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే పశ్చిమ ప్రకాశం ప్రజలకు మేలు జరుగుందని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మంత్రి వర్గ ఉపసంఘానికి తెలిపారు.


